Pawan Kalyan: రాజకీయాలంటే చొరవ చూపించని మా ఇంట్లో వాళ్లు కూడా ఇవాళ ముందుకొచ్చారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan thanked his family members for donating towards Janasene Kaulu Raithu Bharosa program

  • కౌలు రైతు భరోసా నిధికి భారీ విరాళాలు
  • చెక్కులు అందించిన పవన్ కుటుంబ సభ్యులు
  • కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని

ఏపీలో జనసేన పార్టీ చేపడుతున్న కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. రూ.35 లక్షలు జనసేన పార్టీ కౌలు రైతు భరోసా నిధికి విరాళంగా అందజేశారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. రాజకీయాలంటే ఏనాడూ చొరవ చూపించని తమ కుటుంబ సభ్యులు కూడా ఇవాళ కౌలు రైతుల కుటుంబాల పరిస్థితి పట్ల చలించిపోయి ముందుకొచ్చారని వివరించారు. తన వదిన, సిస్టర్స్, పెదనాన్న గారి అబ్బాయి... ఇలా తమ వాళ్లు స్పందించి విరాళాలు అందించారని తెలిపారు. 

"మా అన్నయ్య నాగబాబు, మా వదిన పద్మజ, వాళ్లబ్బాయి, ప్రముఖ హీరో వరుణ్ తేజ్, వాళ్ల పాప నీహారిక, మా అక్క, ప్రముఖ టీవీ కార్యక్రమాల నిర్మాత మాధవి గారు, మా బావ డాక్టర్ రాజు గారు, మా అక్క విజయదర్గ, ఆమె ఇద్దరు పిల్లలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్... వీళ్లందరూ కౌలు రైతుల కుటుంబాలకు ఆపన్నహస్తం అందించేందుకు కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

నేను జనసేనలో ఉన్నప్పటికీ మా ఇంట్లో వరుణ్ తేజ్ కానీ, సాయితేజ్ కానీ, వైష్ణవ్ కానీ, నీహారిక కానీ రాజకీయాల పట్ల తటస్థంగా ఉంటారు. నేను బాగా పనిచేయాలని, గెలవాలని కోరుకుంటారు. వీళ్లంతా కూడా వ్యక్తిగతంగా ఏవో సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే టీవీల్లో, ఇతర మీడియాలో వీళ్లు కౌలు రైతుల పరిస్థితి చూసి కదిలిపోయారు. మొట్టమొదటిసారిగా కలిసికట్టుగా ముందుకొచ్చి జనసేనకు విరాళాలు అందించారు" అని వివరించారు.

  • Loading...

More Telugu News