Lineman: తనకు జరిమానా వేశారన్న కోపంతో పోలీస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరా కట్ చేసిన లైన్ మన్

Lineman cuts power supply to police station after he was fined

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • బరేలీలో లైన్ మన్ గా పనిచేస్తున్న భగవాన్ స్వరూప్
  • బైక్ పై వెళుతుండగా ఆపిన పోలీస్ ఇన్ స్పెక్టర్
  • పత్రాలు లేవంటూ రూ.500 ఫైన్

ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బరేలీ ప్రాంతానికి చెందిన భగవాన్ స్వరూప్ విద్యుత్ శాఖలో లైన్ మన్ గా పనిచేస్తున్నాడు. భగవాన్ స్వరూప్ తన బైక్ పై వెళుతుండగా, మోదీ సింగ్ అనే పోలీస్ ఇన్ స్పెక్టర్ ఆపాడు. ద్విచక్రవాహనానికి సంబంధించిన పత్రాలు చూపించాలని భగవాన్ స్వరూప్ ను కోరాడు.  అయితే ఆ బైక్ కు తగిన పత్రాలు లేకపోవడంతో ఆ పోలీస్ ఇన్ స్పెక్టర్ రూ.500 జరిమానా విధించాడు. 

పత్రాలు ఇంటివద్ద ఉన్నాయని, వెళ్లి తీసుకువస్తానని ఆ లైన్ మన్ చెప్పినా పోలీసు అధికారి అందుకు అంగీకరించలేదు. ఈ ఘటనతో సదరు లైన్ మన్ ఆగ్రహానికి లోనయ్యాడు. దాంతో, పోలీస్ స్టేషన్ కు కరెంట్ కట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అదేమని మీడియా అడిగితే... మీటరు లేకుండానే పోలీసులు కరెంటు వాడుకుంటున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని లైన్ మన్ భగవాన్ స్వరూప్ వివరించాడు. 

ఇదొక్కటే కాదు, ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. పూర్ణియా జిల్లాలో గణేశ్ పూర్ లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఊరంతటినీ అంధకారంలో ముంచేశాడు. ఆ చీకట్లో ఎంచక్కా తన ప్రేయసిని కలిసి ఎవరికీ తెలియకుండా వెనక్కి వచ్చేవాడు. 

ప్రతిరోజూ ఒకే సమయంలో రెండు మూడు గంటల పాటు ఆ గ్రామంలో కరెంట్ పోతుండడంతో అందరూ ఆశ్చర్యపోయేవారు. అదే సమయంలో పొరుగున ఉన్న గ్రామాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేది. కానీ ఈ ఒక్క గ్రామంలోనే అధికారిక కోతలు లేకుండా ఇంతసేపు విద్యుత్ అంతరాయం కలగడం ఏంటని గ్రామస్థులు దీనిపై లోతుగా దృష్టి సారిస్తే... ఓ వ్యక్తి తన ప్రేయసిని కలుసుకునేందుకే ఇలా చేస్తున్నాడని తెలిసి విస్మయానికి గురయ్యారు.

  • Loading...

More Telugu News