Opportunities: వ్యాపార వేత్తలకు రైల్వేలో అవకాశాలు: 'భారత్ గౌరవ్ రైలు' ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి
- కోయంబత్తూర్ నుంచి సాయినగర్ షిర్డీ వరకు ప్రైవేటు రైలు సర్వీసు
- సర్వీసు ప్రొవైడర్ గా సదరన్ రైల్వే
- దేశంలో తొలి భారత్ గౌరవ్ రైలు ఇదే
థీమ్ ఆధారిత టూరిజానికి సంబంధించి రైల్వేలో ఔత్సాహిక వ్యాపార వేత్తలకు అవకాశాలున్నాయని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘భారత్ గౌరవ్’ తొలి రైలు సర్వీసు కోయంబత్తూర్ నుంచి సాయినగర్ షిర్డీకి బయల్దేరిందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. వీడియోను కూడా షేర్ చేశారు.
‘‘2014 నుంచి 2022 మధ్య రైల్వేలో 3.5 లక్షల నియామకాలు జరిగాయి. అంటే ఏటా 43,000 మంది. మరో 1.5 లక్షల మందిని నియమించుకునే ప్రక్రియ జరుగుతోంది’’ అని అశ్వని వైష్ణవ్ తెలిపారు.
భారత్ గౌరవ్ రైలు సర్వీసును సదరన్ రైల్వే చేపట్టింది. కోయంబత్తూర్ నుంచి సాయినగర్ షిర్డీ వరకు భౌరత్ గౌరవ్ సర్వీసును సదరన్ రైల్వే ప్రైవేటుగా నిర్వహించనుంది. రైలులో 1,100 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం, హోటల్లో బస, అక్కడి సందర్శనీయ స్థలాలను చూపించడం, చారిత్రక ప్రదేశాల సందర్శన, టూర్ గైడ్స్ ను సర్వీసు ప్రొవైడర్ సమకూరుస్తుంది. ప్రయాణం, బస, ఆహారం అన్నీ టికెట్ లో కలిసే ఉంటాయి.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఈ రైలు కోయంబత్తూర్ లో బయల్దేరింది. గురువారం ఉదయం 7.25 నిమిషాలకు షిర్డీ చేరుకుంటుంది. ఒకరోజు విరామం తర్వాత తిరిగి శుక్రవారం రైలు కోయంబత్తూర్ కు బయల్దేరుతుంది. శనివారం మధ్యాహ్నం కోయంబత్తూర్ చేరుకుంటుంది.
తిరుపూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట్, బెంగళూరు యలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్, వాడి మీదుగా రైలు ప్రయాణిస్తుంది. మంత్రాలయం రోడ్డు వద్ద 5 గంటలు బ్రేక్ ఉంటుంది. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వీలుగా ఇలా బ్రేక్ ఇస్తారు.