telugu: తెలంగాణలో పదో తరగతి అన్ని బోర్డుల పరిధిలో తప్పనిసరిగా తెలుగు
- ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్య డైరెక్టర్
- అమలులో విఫలమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- అయోమయంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు
తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులు ఈ ఏడాది నుంచి తెలుగును తప్పనిసరిగా చదవాల్సిందే. ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యాక్ట్, 2018ను గతంలోనే తీసుకొచ్చింది. దీని కింద ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు తెలుగును ఒక సబ్జెక్ట్ గా తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాకపోతే పదో తరగతి విద్యార్థులకు అప్పట్లో మినహాయింపు ఇచ్చారు.
తాజాగా పదో తరగతి విద్యార్థులు ఏ బోర్డు (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, స్టేట్) పరిధిలో చదివినా తెలుగును ఎంపిక చేసుకోవాల్సిందే. ఇందుకు సంబంధించిన ఆదేశాలను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జారీ చేశారు. పదో తరగతిలో తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ గా అమలుకు వీలుగా జీవో 15ను జారీ చేస్తూ, దీన్ని అమలు చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. తెలుగు అమలు చేయడంలో విఫలమైతే ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అయితే ఈ ఆదేశాలు ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, ఐబీ బోర్డుల ప్రతినిధులను అయోమయానికి గురి చేశాయి. పదో తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా కేంద్రీకృత విధానంలో నిర్వహిస్తారు కనుక, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఎలా అమలు చేయాలి? అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు.