Vijayasai Reddy: మమతా బెనర్జీ సమావేశంపై విజయసాయిరెడ్డి స్పందన
- మమత సమావేశానికి నిన్నటి వరకు వైసీపీకి ఆహ్వానం అందలేదన్న విజయసాయి
- ఎవరికి మద్దతు ఇవ్వాలనేది జగన్ నిర్ణయిస్తారని వెల్లడి
- ప్రతిపక్షం తమ అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనేది తనకు తెలియదని వ్యాఖ్య
భారత రాష్ట్రపతి ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో అధికార, విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అవుతున్నారు. అయితే ఆమెతో భేటీకి పలువురు సీఎంలు సిద్ధంగా లేనట్టుగా తెలుస్తోంది.
మరోపక్క, మమత నిర్వహించనున్న సమావేశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఈ సమావేశానికి సంబంధించి నిన్నటి వరకు కూడా తమకు ఎలాంటి ఆహ్వానం లేదని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్థికి మద్దతివ్వాలనే విషయంలో జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రతిపక్షం తమ అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు.
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై స్పందిస్తూ... కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలను అనుభవించాల్సిందేనని అన్నారు. సోనియా, రాహుల్ లపై కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడటం లేదని చెప్పారు. సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిల్ పైనే విచారణ సాగుతోందని అన్నారు. ఈడీ విచారణకు రాజకీయాలను ఆపాదించడం తగదని చెప్పారు.