President Of India: తొలి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు... ఒక నామినేషన్ తిరస్కరణ
- రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- బుధవారం నుంచే నామినేషన్ల దాఖలుకు అవకాశం
- తొలి రోజే దాఖలైన 11 నామినేషన్లు
- ఓ నామినేషన్ను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
భారత రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన బుధవారమే ఏకంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జులై 23తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ లోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక రాష్ట్రపతి ఎన్నికలకు పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నా... నామినేషన్ల దాఖలు మాత్రం పార్లమెంటులోని లోక్ సభ సెక్రటేరియట్లోనే కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఓటు వేసే వారిలో 50 మంది ప్రతిపాదిస్తే తప్పించి నామినేషన్లు వేయడం కుదరదు. అయినా కూడా బుధవారం తొలి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు దాఖలు కాగా... వాటిలో సరైన పత్రాలు జతచేయని కారణంగా ఓ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నామినేషన్లు దాఖలు చేసిన వారి వివరాలు తెలియరాలేదు.