ipl: ఐపీఎల్ బంగారు బాతు అయితే.. ఆట దెబ్బతినదా..?
- ఆటకు, డబ్బుకు సంబంధం లేదన్న గంగూలీ
- ఉన్నత స్థానం కోసం ఆడతారన్న అభిప్రాయం
- విజయం సాధించాలన్నదే ప్రతీ ఆటగాడి ఆకాంక్ష అని కామెంట్
ఐపీఎల్ మ్యాచ్ ల మీడియా హక్కులు (అన్ని విభాగాలు కలిపి) రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. ఐపీఎల్ లీగ్ ప్రపంచంలోనే టాప్ 2 లీగ్ గా మారిపోయింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ను దాటిపోయింది. లీగ్ ఇంత ఖరీదైనదిగా మారిపోయినందున ఇది ఆటగాళ్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుందా..? అన్న సందేహంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.
ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘పనితీరుకు డబ్బుతో సంబంధం ఉండదు. సునీల్ గవాస్కర్ కాలం నుంచి అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ వరకు గమనిస్తే.. ఇప్పుడు ఆటగాళ్లు పొందుతున్నంతగా వారి కాలంలో లేదు. కానీ, అందరూ గొప్ప ప్రదర్శన ఇవ్వాలనే కృషి చేశారు.
ఆటగాళ్లు కేవలం డబ్బు కోసమే ఆడతారని నేను భావించను. ఆటగాళ్లు ఉన్నత స్థానం కోసం, భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించామన్న గౌరవం కోసం ఆడతారు. ప్రతి ఆటగాడు అంతర్జాతీయ టోర్నమెంట్లలో గొప్ప విజయం సాధించాలనే కోరుకుంటాడు’’ అని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.
మీడియా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోవడాన్ని.. భారత క్రికెట్ బలోపేతానికి లభించిన పెద్ద అవకాశంగా గంగూలీ అభివర్ణించాడు. మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం లభించినట్టు చెప్పాడు. "ఈ డబ్బు క్షేత్రస్థాయికి వెళ్లాలి. అన్ని వయసుల్లోని ఆటగాళ్ల ఫీజులను పెంచేందుకు బోర్డుకు అవకాశం కల్పించింది. మహిళా క్రికెట్లర వేతనాలను పెంచుతాం’’ అని గంగూలీ వివరించాడు.