Rats: రూ.5 లక్షల విలువైన నగలను డ్రైనేజి పాలుచేసిన ఎలుకలు... ఎట్టకేలకు యజమానికి అప్పగించిన పోలీసులు
- ముంబయిలో ఘటన
- నగలు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు బయల్దేరిన మహిళ
- వడా పావ్ సంచి అనుకుని నగల సంచి చిన్నారులకు ఇచ్చిన వైనం
- ఆ సంచిని చెత్తకుండీలో వేసిన చిన్నారులు
- ఆ సంచిని డ్రైనేజీలోకి లాక్కెళ్లిన మూషికాలు
ముంబయిలో ఆసక్తికర సంఘటన జరిగింది. 45 ఏళ్ల సుందరి ప్లానిబేల్ గోరేగావ్ లోని గోకుల్ ధామ్ కాలనీలో ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తోంది. రూ.5 లక్షల విలువ చేసే తన నగలను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బయలుదేరింది. మార్గమధ్యంలో ఇద్దరు చిన్నారులు కనిపించగా, ఇదిగో... ఇందులో వడా పావ్ ఉన్నాయి తినండి అంటూ వారికి ఓ సంచి ఇచ్చింది. బ్యాంకుకు వెళ్లి చూడగా, తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు. ఆ చిన్నారులకు ఇచ్చిన సంచిలో నగలు ఉన్నట్టు గుర్తించింది.
అయితే, తాను చిన్నారులకు సంచి ఇచ్చిన ప్రాంతానికి వెళ్లి చూడగా, అక్కడ ఆ చిన్నారులు కనిపించలేదు. దాంతో సుందరి ప్లానిబేల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎట్టకేలకు చిన్నారుల ఆచూకీ కనుగొన్నారు. వారిని ప్రశ్నించగా, వడా పావ్ తినాలని అనిపించకపోవడంతో ఆ సంచిని చెత్తకుండీలో విసిరేశామని చెప్పారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. ఆ చెత్తకుండీలోంచి నగల సంచీని కొన్ని ఎలుకలు పక్కనే ఉన్న డ్రైనేజీలోకి తీసుకెళ్లడం కనిపించింది. వెంటనే ఆ కాలువ నుంచి నగల సంచిని వెలికి తీసి సుందరి ప్లానిబేల్ కు అందజేశారు.