Musa Mohammadi: ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో జర్నలిస్టు... ఇప్పుడు సమోసాలు అమ్ముకుంటున్నాడు!

Afghan journalist selling samosas to make ends meet
  • ఆఫ్ఘన్ లో మళ్లీ తాలిబన్ పాలన
  • దుర్భరంగా మారిన ప్రజాజీవనం
  • మూతపడిన టీవీ చానళ్లు
  • ఉద్యోగాలు కోల్పోయిన వందలాది మంది
  • వారిలో మూసా మొహమ్మది ఒకరు
  • టీవీ యాంకర్ గా గుర్తింపు పొందిన మొహమ్మది
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ఏలుబడిలో సాధారణ ప్రజలే కాదు, గతంలో ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నవారు సైతం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందుకు మూసా మొహమ్మది అనే పాత్రికేయుడి జీవితమే ప్రబల నిదర్శనం. ఒకప్పుడు మొమహ్మది ఆఫ్ఘన్ లో ఓ న్యూస్ టీవీ చానల్లో యాంకర్ గా పనిచేశాడు. అనేక ఏళ్ల పాటు మీడియా రంగంలో ప్రముఖ యాంకర్ గా గుర్తింపు అందుకున్నాడు. అయితే అది గతం. 

తాలిబన్లు మళ్లీ గద్దెనెక్కాక అనేక ఆఫ్ఘన్ టీవీ చానళ్లు మూతపడ్డాయి. వందల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డునపడ్డారు. అలాంటివారిలో మూసా మొహమ్మది కూడా ఉన్నాడు. అయితే, కుటుంబ పోషణ కోసం ఈ పాత్రికేయుడు వీధుల్లో సమోసాలు అమ్ముకుంటూ దర్శనమిచ్చాడు. అతడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

అతడి పరిస్థితిపై ఆఫ్ఘనిస్థాన్ జాతీయ రేడియో, టీవీ విభాగం డైరెక్టర్ అహ్మదుల్లా వాసిక్ స్పందించారు. ఆఫ్ఘన్ లో నిపుణుల అవసరం ఎందో ఉందని, మూసా మొహమ్మదికి తమ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. 

కాగా, మొహమ్మది సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న విషయాన్ని మాజీ అధికారి కబీర్ హక్మల్ తెరపైకి తీసుకువచ్చారు. ఆయనే మొహమ్మది ఇటీవలి ఫొటోను తొలిసారి పంచుకున్నారు. కబీర్ హక్మల్ గతంలో హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేశారు.
Musa Mohammadi
Samosa
Journalist
Afghanistan

More Telugu News