Inzamam Ul Haq: ద్రావిడ్ ఉన్నంత వరకు టీమిండియా ఓడిపోయే అవకాశం లేదు: ఇంజమామ్ ఉల్ హక్
- టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు అద్భుతంగా రాణిస్తోందన్న ఇంజీ
- యువ ఆటగాళ్లు పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారని ప్రశంస
- అండర్-19 ఫార్ములాను యువ ఆటగాళ్లతో ద్రావిడ్ అమలు చేస్తున్నాడని వ్యాఖ్య
దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ఇక సిరీస్ చేజారినట్టే అని అందరూ భావిస్తున్న తరుణంలో మూడో మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. మిగిలిన రెండు మ్యాచ్ లను గెలిస్తే సిరీస్ భారత్ వశం అవుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆల్ టైమ్ గ్రేట్, మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఉన్నంత వరకు ఇండియా ఓడిపోదని ఇంజీ తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకపోయినా... టీమిండియా అద్భుతంగా రాణిస్తోందని ఆయన కితాబునిచ్చారు. ద్వితీయ శ్రేణి జట్టుతో భారత్ గొప్పగా ఆడుతోందని అన్నారు. పోరాట పటిమను ప్రదర్శిస్తున్న యువ ఆటగాళ్లను అభినందించాల్సిందేనని చెప్పారు. స్వదేశంలో భారత్ సహజంగా ఓడిపోదని... ఇప్పుడు ద్రావిడ్ కూడా ఉండటం వారికి మరింత కలిసొచ్చే అంశమని అన్నారు. మూడో మ్యాచ్ ని భారత్ కైవసం చేసుకోవడంతో... సిరీస్ ఆసక్తికరంగా మారిందని చెప్పారు.
ఈ సిరీస్ ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంటుందని తొలుత అనిపించిందని... అయితే భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను అడ్డుకున్నారని ఇంజమామ్ తెలిపారు. భారత్ కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు అద్భుతంగా పోరాడుతుండటం... చూడ్డానికి కనులవిందుగా ఉందని చెప్పారు. అండర్-19 జట్టుతో పని చేసిన అనుభవం ద్రావిడ్ కు ఉందని... ఆ అండర్-19 ఫార్ములానే ఇప్పుడు కూడా యువ ఆటగాళ్లతో ఆయన అమలు చేస్తున్నాడని అన్నారు.