Navy Chief: అగ్నిపథ్ మన దేశంలోనే అతి పెద్ద రిక్రూట్ మెంట్ పథకం: నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్
- అగ్నిపథ్ రూపొందించిన ప్రణాళిక బృందంలో నేను కూడా సభ్యుడినే
- అగ్నిపథ్ కోసం ఏడాదిన్నర పని చేశాను
- నాలుగేళ్ల తర్వాత సాయుధ బలగాల్లో చేరే అవకాశం ఉంటుంది
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ ఈ పథకంపై చెలరేగుతున్న నిరసనలను తాను అసలు ఊహించలేదని చెప్పారు. ఈ పథకం చాలా గొప్పదని అన్నారు. మన దేశ సైన్యానికి సంబంధించి ఇది అతి పెద్ద రిక్రూట్ మెంట్ స్కీమ్ అని చెప్పారు. ఈ పథకాన్ని రూపొందించిన ప్రణాళిక బృందంలో తాను కూడా సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. అగ్నిపథ్ కోసం తాను ఏడాదిన్నర పని చేశానని చెప్పారు.
అగ్నిపథ్ ద్వారా సైన్యంలో చేరిన వారు ఆ తర్వాత సాయుధ బలగాల్లో చేరే అవకాశం ఉంటుందని హరికుమార్ తెలిపారు. ఇంతకు ముందు సాయుధ బలగాల్లో ఒక్కరు పని చేసే చోట... ఈ పథకం వల్ల నలుగురికి అవకాశం లభిస్తుందని చెప్పారు. నాలుగేళ్లు సైన్యంలో పని చేసిన తర్వాత ఎన్నో అవకాశాలు ఉంటాయని తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాలలో ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని తెలిపారు.