Shiv Sena: విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టకుంటే ఏం జరుగుతుందంటే..?: శివసేన
- ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న శివసేన
- ప్రధాని అభ్యర్థిని ఎలా నిలబెట్టగలరని ప్రశ్నిస్తారని వ్యాఖ్య
- ఎన్నికల్లో విపక్షాలు బలమైన పోటీని సృష్టించలేకపోతున్నాయన్న శివసేన
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఈసారి కూడా బీజేపీ కూటమి అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు, ఎవరిని బరిలోకి దించాలా? అని విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. విపక్షాల తరపున అభ్యర్థి పోటీ చేస్తారా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక బలమైన అభ్యర్థిని విపక్షాలు నిలబెట్టలేకపోతే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివసేన తెలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టలేని వాళ్లు... ఒక సమర్థవంతమైన ప్రధాని అభ్యర్థిని ఎలా నిలబెట్టగలరని ప్రజలు ప్రశ్నిస్తారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ ను ప్రచురించింది. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మహాత్మాగాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ, ఫరూక్ అబ్దుల్లాల పేర్లను విపక్షాలు తెరపైకి తెస్తాయని... కానీ, ఎన్నికల్లో బలమైన పోటీని మాత్రం సృష్టించలేకపోతున్నాయని వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమి కూడా సరైన అభ్యర్థిని ప్రకటించలేకపోతోందని శివసేన వ్యాఖ్యానించింది. ఐదేళ్ల క్రితం ఇద్దరు, ముగ్గురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి రామ్ నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించిందని... ఇప్పుడు కూడా అదే చేస్తుందని చెప్పింది.