Nadendla Manohar: రైతు భరోసా కేంద్రాల్లో రూ.6,300 కోట్ల అవినీతి జరిగింది: నాదెండ్ల మనోహర్
- ఆర్బీకేలకు కోట్ల నిధులు కేటాయించారన్న నాదెండ్ల
- సర్కారు గొప్పలు చెప్పిందని వెల్లడి
- రైతులకు భరోసా దక్కడంలేదని ఆరోపణ
- ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తామని స్పష్టీకరణ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల్లో రూ.6,300 కోట్ల భారీ అవినీతి జరిగిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు గింజ సరఫరా చేయడం నుంచి మళ్లీ గింజ కొనుగోలు చేసే వరకు రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని అన్నారు. దీనికోసం రూ.6,300 కోట్లు కేటాయించారని వెల్లడించారు.
అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యాలయాలుగా, దళారులకు కేంద్రాలుగా మారిపోయాయని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న భరోసా పూర్తిగా శూన్యమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. న్యాయంగా రైతులకు దక్కాల్సిన రైతు భరోసా నిధులు సైతం కులాలు, ప్రాంతాలు, పార్టీల వారీగా విభజిస్తూ ఇస్తున్నారని మండిపడ్డారు. అక్కడ కూడా రైతులకు సరైన న్యాయం జరగడంలేదని అన్నారు.
ఈ రూ.6,300 కోట్ల రైతు భరోసా కేంద్రాల అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు. రైతులకు అందని సేవలపై ఇంత భారీ మొత్తంలో నిధులు ఎందుకు ఖర్చు చేశారో కచ్చితంగా ప్రశ్నిస్తామని అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు.