NCA chief: మహిళా క్రికెట్ జట్టుతో భేటీ అయిన వీవీఎస్ లక్ష్మణ్
- క్రికెటర్లతో మాట్లాడిన వీవీఎస్ లక్షణ్
- హెచ్ కోచ్ రమేష్ పొవార్ కూడా హాజరు
- శ్రీలంక సిరీస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం
నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్ సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్.. శ్రీలంక పర్యటనకు ముందు భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. మిథాలీ రాజ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత.. భారత జట్టు ఎదుర్కొంటున్న తొలి సిరీస్ ఇది. సెలక్షన్ కమిటీ టీ20 కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ ను ఎంపిక చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా జట్టుతో లక్ష్మణ్ ప్రత్యేక భేటీ నిర్వహించడం గమనార్హం.
భారత్, శ్రీలంక మూడు టీ20 మ్యాచ్ లు, పలు వన్డే మ్యాచుల్లో జూన్ 23 నుంచి జులై 7 మధ్య పోటీపడనున్నాయి. స్థిరమైన ఆటతీరు, గెలిచే తత్వాన్ని తాము కోరుకుంటున్నట్టు హెడ్ కోచ్ రమేష్ పొవార్ తెలిపాడు. ఇందుకోసం తాము కెప్టెన్, కోచ్, వైస్ కెప్టెన్ అందరూ కలసి పనిచేస్తున్నట్టు చెప్పారు. ఎన్ సీఏ హెడ్ లక్ష్మణ్, బీసీసీఐతో మాట్లాడినట్టు తెలిపారు. ఏ పరిస్థితుల్లో అయినా పోటీనిచ్చే జట్టును నిర్మించాల్సి ఉందంటూ.. ఫీల్డింగ్, ఫిట్ నెస్ ను మెరుగుపరచడంపై దృష్టి పెట్టినట్టు చెప్పాడు.