Winter Session: కొత్త భవనంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాలు: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- కొత్త భవనం భారతదేశ స్వావలంబన చిత్రాన్ని స్పష్టంగా చూపిస్తుంది
- సాంకేతిక, భద్రత పరంగా పాత భవనం కంటే ఎంతో ముందంజలో కొత్త భవనం
- సభ్యుల సహకారంతో ఉత్పాదకత పెరిగిందన్న ఓం బిర్లా
లోక్‌సభ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో ఉండే అవకాశం ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. కొత్త భవనంలో శీతాకాల సమావేశాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, కొత్త భవనం భారతదేశ స్వావలంబన చిత్రాన్ని స్పష్టంగా చూపుతుందని అన్నారు. సాంకేతికత, భద్రత పరంగా చూస్తే పాత భవనంతో పోలిస్తే కొత్త భవనం ఎంతో ముందుంటుందని అన్నారు. అయితే, పార్లమెంటు భవనం కూడా కొత్త దాంట్లో భాగంగా ఉంటుందని ఓం బిర్లా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పార్లమెంటులో ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని ఓం బిర్లా అన్నారు. సభ్యులందరి సహకారంతో సభను రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అన్ని పార్టీలు తమ నేతలతో మాట్లాడాలని స్పీకర్ అన్నారు. తాను కూడా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడి సభ సజావుగా సాగాలని, క్రమశిక్షణ, సభా మర్యాదలు పాటించాలని చెబుతూనే ఉంటానని చెప్పారు. సభ్యుల సహకారంతో ఉత్పాదకత, చర్చల స్థాయి గణనీయంగా పెరిగిందని అన్నారు.