Ambati Rambabu: బీజేపీని రోడ్డున పడేసిన పవన్ కల్యాణ్ తాను వేరేదారి చూసుకుంటున్నారు: మంత్రి అంబటి రాంబాబు
- ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం తరలివచ్చిన వైసీపీ మంత్రులు
- అంబటి, పెద్దిరెడ్డి ప్రెస్ మీట్
- పవన్ కు రాజకీయ స్పష్టత లేదన్న అంబటి
- ఎప్పుడు ఎవరితో కలిసుంటాడో తెలియదని ఎద్దేవా
ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార వైసీపీ తన మంత్రులను అక్కడ మోహరించింది. ఇవాళ మంత్రులు అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆత్మకూరు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి అని, ఏ పార్టీతోనూ ఎక్కువకాలం ఉండడని వ్యాఖ్యానించారు. కొంతకాలం టీడీపీతో ఉంటాడు, కొంతకాలం సీపీఐ, సీపీఎంలతో ఉంటాడు, ఇంకొంతకాలం వేరే పార్టీలతో ఉంటాడు అని ఎద్దేవా చేశారు. పవన్ ఎప్పుడు ఎవరితో ఉంటాడో ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కావడంలేదన్నారు.
"ఇప్పుడు కొన్ని రంగులు బయటపడుతున్నాయి. ఏ పార్టీకి ఎవరితో సంబంధాలున్నాయనేది తేలుతోంది. ఇటీవల బద్వేలు ఎన్నిక జరిగింది. మేమే గెలిచాం. అయితే, టీడీపీ బద్వేలులో పోటీచేసింది... ఇప్పుడు ఆత్మకూరులోనూ పోటీ చేస్తోంది. బీజేపీ నాడు బద్వేలులో పోటీ చేసింది, ఇప్పుడు ఆత్మకూరులోనూ పోటీ చేస్తోంది. అయితే అర్థంకాని విషయం ఏమిటంటే... అసలు బీజేపీతో జనసేనకు పొత్తు ఉందా?
తమకు జనసేనతో పొత్తు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు... తమకు బీజేపీతో పొత్తు ఉందని జనసేన నేతలు అంటున్నారు. మరి పొత్తు ఉంటే ఇప్పుడెందుకు కలిసి పనిచేయడంలేదు? ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయ్యా... నువ్వు టీడీపీతో ఉన్నావా? లేక, బీజేపీతో ఉన్నావా? లేక, సింగిల్ గా ఉన్నావా? నువ్వు ఎవరితో ఉన్నావో అర్థంకాక జనసేన కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
మాకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంది, మేం బీజేపీతోనే ఉన్నాం అని చెప్పిన నువ్వు... ఇప్పుడు బీజేపీ వాళ్లు రోడ్డుమీదికి వచ్చి పోటీ చేస్తుంటే వాళ్లను రోడ్డునపడేసి నువ్వేంటయ్యా వేరేదారి చూసుకుంటున్నావు? ఇది మోసం కాదా? అసలు నీకేమైనా రాజకీయాలపై అవగాహన ఉందా? లేక ఇదేమైనా మోసపు పొత్తా? పవన్ కల్యాణ్ జవాబు చెప్పాలి. దీనిపై స్పందించాల్సిన బాధ్యత బీజేపీపై కూడా ఉంది. జనసేనతో పొత్తులో ఉన్నారో లేదో బీజేపీ నేతలు చెప్పాలి" అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
దేశంలో రాజకీయ స్పష్టత లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీయేనని అంబటి విమర్శించారు. ఎవరితో కలిసుంటాడో తెలియని గందరగోళ స్థితి సృష్టించే నాయకుడు పవన్ కల్యాణ్ అని వ్యాఖ్యానించారు.