Pawan Kalyan: వైసీపీ నేతలు అధికార మదంతో కొట్టుకుంటున్నారు: పర్చూరులో పవన్ కల్యాణ్

Pawan Kalyan take swipe at YCP leaders in Parchuru

  • పవన్ కౌలు రైతు భరోసా యాత్ర
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటన
  • పర్చూరులో రచ్చబండ సభ
  • వైసీపీపై జనసేనాని ఆగ్రహావేశాలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా పర్చూరులో రచ్చబండ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అధికారమదంతో కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు సంస్కారం లేదన్నారు. తాను అన్యాయంపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని అన్నారు. వైసీపీ నేతలు ఎవరినైనా, ఏమైనా అనొచ్చు కానీ, ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. వైసీపీ అరాచకాలపై ప్రశ్నిస్తే దత్తపుత్రుడు అంటున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ దత్తపుత్రుడ్ని కాదని, కేవలం ప్రజలకే దత్తపుత్రుడ్ని అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. జగన్ మాత్రం కచ్చితంగా సీబీఐకి దత్తపుత్రుడేనని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోకతప్పదని స్పష్టం చేశారు. 

కాగా, పర్చూరు సభలో 80 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, కన్నీళ్లు తుడవడానికి డబ్బు కంటే గుండె ఉంటే చాలని అన్నారు. మూడేళ్లలో 3 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడమే వైసీపీకి పనిగా మారిందని విమర్శించారు. తాను గట్టిగా నిలదీస్తే తనపై వ్యక్తిగత దాడులకు ప్రయత్నిస్తున్నారని, వారికి తెలియని విషయం ఏమిటంటే తాను లోపల చాలా గట్టిమనిషినని పవన్ స్పష్టం చేశారు. ఇలాంటివాటికి భయపడబోనని అన్నారు. 

"మీరు ఏస్థాయిలో జనసేనతో గొడవ పెట్టుకుంటారో చెప్పండి... మేం అందుకు సిద్ధం అని వైసీపీకి పోయినసారే చెప్పాను. మీరు పాలసీ ప్రకారం మాట్లాడదామంటే మేం మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తాం. అలాకాకుండా, అడ్డంగా రోడ్లమీదకు వచ్చి దాడులు చేస్తాం అంటే మేం కూడా తక్కువవాళ్లమేమీ కాదని మీరు గుర్తుంచుకోవాలి. మీ దగ్గర అధికార, గూండా బలం ఉండొచ్చేమో... కానీ మా దగ్గర టంగుటూరి ప్రకాశం పంతులు గుండెబలం ఉంది. ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడు అంటారు. నేనేమీ సరదాగా రాజకీయాల్లోకి రాలేదు. 2003లో మా నాన్న గారికి చెప్పాను. అన్యాయం జరుగుతుంటే ముందుకు రాకుండా ఎలా ఉండగలం? అనుకుని రాజకీయాల్లోకి వచ్చాను" అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News