SP Anuradha: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం, కాల్పుల ఘటనపై ఎస్పీ అనురాధ వివరణ

Railway SP Anuradha explains riots at Secunderabad railway station
  • అగ్నిపథ్ పై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసకాండ
  • కాల్పులు జరిపిన పోలీసులు
  • ఒకరి మృతి
  • కాల్పులు జరిపింది రైల్వే పోలీసులేనన్న రైల్వే ఎస్పీ
కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపథ్ సైనిక నియామక విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విధ్వంసం, పోలీసు కాల్పులు జరగడం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ వివరణ ఇచ్చారు. ఆర్మీ ఆశావహులకు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల సలహా మేరకే రైల్వే స్టేషన్ పై దాడి చేశారని వెల్లడించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై దాడి జరుగుతుందని తాము ఊహించలేదని ఎస్పీ అనురాధ తెలిపారు. 

నిరసనకారులు ఈ నెల 16నే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పరస్పరం సమాచారం అందించుకున్నారని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ఈ కేసులో ఇప్పటిదాకా 46 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. 

కాగా, రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రమాదాన్ని నివారించడానికే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) కాల్పులు జరిపిందని ఎస్పీ అనురాధ స్పష్టం చేశారు. రైల్వే పోలీసులు మొత్తం 20 రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు.
SP Anuradha
Secunderabad Railway Station
Violence
Riots

More Telugu News