Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ కూల్చివేతపై ఏపీ హైకోర్టు విస్మయం.. ఇదేం పద్ధతంటూ ఆగ్రహం
- కూల్చివేతను ఆపాలంటూ అయ్యన్న కుమారుల హౌస్‌మోషన్ పిటిషన్
- కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టడంపై న్యాయమూర్తి విస్మయం
- కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీని మునిసిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చివేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు చేపట్టేందుకు వీల్లేదంటూ న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించి ఇదేం పనంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఇంటి ప్రహరీ కూల్చివేతను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేశ్ నిన్న హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ల తరపు న్యాయవాది వీవీ సతీష్ తన వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారమే ప్రహరీ నిర్మాణం జరిగిందని, తహసీల్దార్, జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించిన తర్వాతే గోడను నిర్మించినట్టు కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షతో, నిబంధనలను ఉల్లంఘించి కూల్చివేత ప్రారంభించారన్నారు.
ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్.. అర్ధరాత్రి కూల్చివేతలేంటంటూ విస్మయం వ్యక్తం చేశారు. కూల్చివేత ప్రక్రియలో ముందుకెళ్లవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల విషయాన్ని అధికారులకు వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. రెవెన్యూశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రహరీలోని కొంత భాగాన్ని ఇప్పటికే కూల్చివేసినట్టు చెప్పారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.