Agnipath Scheme: నరసరావుపేటలో ఐబీ, ఐటీ అధికారులు!... అగ్నిపథ్ అల్లర్ల మూలాల వేట షురూ!
- సికింద్రాబాద్ అల్లర్ల వెనుక ఆవుల సుబ్బారావు హస్తముందని ఆరోపణలు
- నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడెమీని నిర్వహిస్తున్న సుబ్బారావు
- అకాడెమీలో తనిఖీల కోసం నరసరావుపేట వచ్చిన ఐబీ, ఐటీ బృందాలు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై మిన్నంటిన నిరసనల మూలాల వేటను కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐటీ), ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు సోమవారం ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోదాలు ప్రారంభించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు నరసరావుపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి డిఫెన్స్ అకాడెమీ అధినేత ఆవుల సుబ్బారావు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న ఐబీ అధికారులు నరసరావుపేటకు వచ్చారు. ఐటీ అధికారులతో కలిసి వచ్చిన వారు వచ్చీరాగానే పట్టణంలోని సాయి డిఫెన్స్ అకాడెమీకి వెళ్లారు.
ఈ సందర్భంగా సాయి డిఫెన్స్ అకాడెమీలో రికార్డులను ఐబీ, ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. అకాడెమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు చెల్లించిన ఫీజుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా అకాడెమీలోని సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నించారు.