Supriya Shrinate: కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్‌గా టైమ్స్ గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
- టైమ్స్ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేసిన సుప్రియ
- రోహన్ గుప్తా స్థానంలో సుప్రియ నియామకం
- ఇప్పటిదాకా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగిన సుప్రియ
కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా విభాగం అధిపతిగా పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనతేను నియమించింది. పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలిగానూ ఇప్పటిదాకా కొనసాగిన ఆమెను పార్టీ సోషల్ మీడియాతో పాటు పార్టీకి చెందిన అన్ని డిజిటల్ విభాగాలకు అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కేసీ వేణు గోపాల్ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ సోషల్ మీడియా చీఫ్‌గా సుప్రియ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇదిలా ఉంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా రోహన్ గుప్తా పనిచేశారు. తాజాగా ఆ పదవిలో సుప్రియను నియమించడంతో రోహన్ గుప్తాకు పార్టీ అధికార ప్రతినిధిగా కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు సుప్రియ శ్రీనతే ప్రముఖ మీడియా గ్రూప్ టైమ్స్ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేశారు. మీడియాలో సుదీర్ఘ కాలం పనిచేసిన సుప్రియ సారథ్య బాధ్యతల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మరింత మెరుగైన పనితీరు కనబరచనుందన్న వాదనలు పార్టీలో వినిపిస్తున్నాయి.