Team India: టీమిండియా వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కు కరోనా.. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు కోసం ఆలస్యంగా పయనం
- ప్రస్తుతం క్వారంటైన్‌లో అశ్విన్
- లీసెస్టైర్‌తో జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు అశ్విన్ దూరం
- రీ షెడ్యూల్డ్ టెస్టుకు అందుబాటులో ఉంటాడన్న బీసీసీఐ
- నిన్న ఇంగ్లండ్ బయలుదేరిన ద్రవిడ్, పంత్, అయ్యర్
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారినపడ్డాడు. విషయం తెలిసిన వెంటనే అశ్విన్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న చివరిదైన ఐదో టెస్టు (రీ షెడ్యూల్డ్ టెస్ట్) కోసం అశ్విన్ ఆలస్యంగా ఇంగ్లండ్ వెళ్లనున్నాడు. కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం ప్రొటోకాల్ ప్రకారం అతడు ఇంగ్లండ్ వెళ్తాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కాగా, రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.
శుక్రవారం నుంచి లీసెస్టైర్‌తో ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు అశ్విన్ అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ అధికారి తెలిపారు. బర్మింగ్‌హామ్‌లో జులై 1 నుంచి జరగనున్న టెస్టు మ్యాచ్‌కు మాత్రం అశ్విన్ అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. కాగా, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగియడంతో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌తోపాటు శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ నిన్న ఇంగ్లండ్ బయలుదేరారు. కాగా, ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ అనంతరం మూడు మ్యాచ్‌ల టీ20, మూడుల వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి.