Rahul Dravid: పంత్ కెప్టెన్సీపై తీర్పు ఇచ్చిన రాహుల్ ద్రవిడ్
- కెప్టెన్ గా పంత్ మెరుగు పడుతున్నాడన్న ద్రవిడ్
- అతడ్ని యువ కెప్టెన్ గా అభివర్ణన
- ఒక్క సిరీస్ తోనే తీర్పు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం
- 2-2 స్థాయికి ఫలితాన్ని తీసుకెళ్లడం పట్ల హర్షం
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు నాయకత్వం వహించిన రిషబ్ పంత్.. ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నిజానికి దక్షిణాఫ్రికాతో సిరీస్ లో భారత జట్టు భిన్నంగా కనిపించింది. మొదటి రెండు మ్యాచుల్లో దారుణ పరాభవాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే.. తదుపరి రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసేయడం ఎవరూ ఊహించనిది. వరుణుడు ఐదో మ్యాచ్ కు అడ్డుపడి రెండు జట్ల ఫలితాన్ని సమం చేశాడు. అయితే, పంత్ కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పంత్ విషయంలో తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశాడు.
‘‘జట్టును 0-2 స్థాయి నుంచి 2-2 స్థాయికి తీసుకెళ్లి గెలిచే అవకాశాన్ని తీసుకురావడం నిజంగా బాగుంది. కెప్టెన్సీ అంటే గెలుపు, ఓటములు కాదు. అతడు (పంత్) యువ సారథి. నాయకుడిగా మెరుగుపడుతున్నాడు. అతడి విషయంలో అప్పుడే తీర్పు ఇచ్చేయడం తొందరపాటు అవుతుంది. ఒక్క సిరీస్ తోనే అలా మార్పులు చేయకూడదు. అతడు జట్టును నడిపించే అవకాశాలు లభించడం పట్ల ఆనందంగా ఉంది. అతడిపై ఎంతో ఒత్తిడి ఉంది. కానీ, ఆ అనుభవం నుంచి నేర్చుకుంటున్నాడు. 0-2 స్థాయి నుంచి జట్టును 2-2 స్థాయికి తీసుకెళ్లడం పట్ల అతడిని అభినందించాల్సిందే’’ అని ద్రవిడ్ తెలిపాడు.