Somireddy Chandra Mohan Reddy: మహోన్నత వ్యక్తి వెంకయ్యనాయుడు ఉండగా రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషణా..?: సోమిరెడ్డి
- జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు
- అభ్యర్థి కోసం వేటలో ఎన్డీయే, విపక్షాలు
- వెంకయ్యనాయుడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సోమిరెడ్డి
- ప్రపంచదేశాల్లో గౌరవం పెరుగుతుందని సూచన
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ఇటు అధికార ఎన్డీయే, అటు విపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.
"జులై 18న దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో అత్యున్నతమైన, రాజ్యాంగపరమైన పదవి... రాష్ట్రపతి పదవి. ప్రపంచదేశాలన్నీ ఈ పదవికి గౌరవం ఇస్తాయి. అయితే, ఎన్డీయే, యూపీఏ, అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి కోసం వెతుకుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ముప్పవరపు వెంకయ్యనాయుడి వంటి మచ్చలేని మహోన్నత వ్యక్తిని చేతిలో పెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి కోసం పాకులాడుతున్నాయి. గతంలో ఉపరాష్ట్రపతులు రాష్ట్రపతి అయిన సంప్రదాయం ఉంది. వెంకయ్యనాయుడిది నిష్కల్మష జీవితం. ఆయన జీవితం ప్రజలకు అంకితం.
అధికారంలో ఉండే ప్రభుత్వ పెద్దలకు, ఎన్డీయే మిత్రపక్షాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వెంకయ్యనాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించండి. ఎలాంటి పోటీలేకుండా రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవడానికి ఇదే అవకాశం. ఆయన పేరు ప్రకటిస్తే, ఆయనకు పోటీగా అభ్యర్థిని బరిలో దింపడానికి విపక్షాలు కూడా సాహసించవు. వెంకయ్యనాయుడి వంటి మంచి వ్యక్తి రాష్ట్రపతి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
రాష్ట్రపతి ఎన్నికలను ఇంత వివాదాస్పదం చేసుకోవాల్సిన అవసరంలేదు. ప్రతిపక్షాలు రోజుకొక అభ్యర్థిని తెరపైకి తీసుకురావాల్సిన అవసరం లేదు. వెంకయ్యనాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రపంచదేశాల్లో భారత్ కు గౌరవం మరింత పెరుగుతుంది" అని సోమిరెడ్డి సూచించారు.
కాగా, రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జులై 24 నాటికి రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. నామినేషన్ల స్వీకరణ జూన్ 29 వరకు జరగనుంది. జూన్ 30న నామినేషన్ల పరిశీలన చేపడతారు. జులై 2తో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుంది.