Balakrishna: బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ యోగాసనాలు... ఫొటోలు ఇవిగో!

Balakrishna performs Yoga at Basavatarakam hospital on International Yoga Day

  • నేడు అంతర్జాతీయ యోగా డే
  • వివిధ ఆసనాలతో యోగా ప్రాధాన్యత చాటిన బాలయ్య
  • ప్రశాంతత లభిస్తుందని వెల్లడి
  • వేదకాలం నుంచే యోగా ఉందని స్పష్టీకరణ

ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో యోగాసనాలు వేశారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ అయిన బాలకృష్ణ వివిధ ఆసనాల ద్వారా యోగా ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఫేస్ బుక్ ద్వారా పంచుకున్నారు.

దీనిపై ఆయన వ్యాఖ్యానిస్తూ, ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటని కీర్తించారు. దేశంలో వేదకాలం నుంచి యోగా ఉన్నట్టు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయని తెలిపారు. మనిషి మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని బాలకృష్ణ వివరించారు. కాబట్టే, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని తెలిపారు. 

యోగా అన్న పదం సంస్కృతంలోని 'యజ' అన్న పదం నుంచి పుట్టిందని, 'యజ' అంటే దేన్నైనా ఏకం చేయగలగడం అని అర్థమని వివరించారు. మనస్సును, శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యాన్ని అందించేది యోగా అని చెబుతారని వెల్లడించారు.  

భారతదేశం చొరవతో, 177 దేశాల మద్దతుతో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014లో ప్రకటించిందని బాలకృష్ణ పేర్కొన్నారు. ఏడాదిలో పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని, అందుకే ఆ రోజున యోగా డే పాటిస్తారని వివరించారు.
.

  • Loading...

More Telugu News