Telangana: పార్టీని వీడతానంటూ టీఆర్ఎస్కు తేల్చిచెప్పిన మాజీ ఎమ్మెల్యే
- 2014లో అశ్వారావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన తాటి
- 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెచ్చా చేతిలో ఓటమిపాలు
- ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్న మెచ్చా, తాటి
- తనకు ప్రాధాన్యం దక్కడం లేదని తాటి వెంకటేశ్వర్లు ఆరోపణ
- రాజకీయాల్లో కేటీఆర్ కూడా తనకంటే జూనియర్ అని ప్రకటన
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్కు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అల్టిమేటం జారీ చేసిన ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీలో తనకు తగిన రీతిలో గుర్తింపు దక్కడం లేదని ఆరోపించిన ఆయన... ఈ వ్యవహారంపై అధిష్ఠానం స్పందించకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే ఆయన పార్టీ అధిష్ఠానానికి తేల్చిచెప్పడం గమనార్హం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నిక (2014 ఎన్నిక)ల్లో వైసీపీ అభ్యర్థిగా అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మెచ్చా నాగేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. తదనంతర కాలంలో మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. అంటే... 2018లో వైరి వర్గాలుగా పోరాడిన ఇద్దరూ టీఆర్ఎస్లోకి చేరిపోయారన్న మాట.
తాజాగా మంగళవారం మీడియా ముందుకు వచ్చిన తాటి వెంకటేశ్వర్లు... మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో తుమ్మల సొంతూళ్లోనూ టీఆర్ఎస్కు ఓట్లు పడలేదని ఆయన ఆరోపించారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే సత్తా తుమ్మలకు లేదని ఆయన ఆరోపించారు. పార్టీ కీలక నేతలు సహకరించని కారణంగానే తాను ఓడిపోయానని ఆయన చెప్పారు. నాయకులందరినీ కలుపుకుని జిల్లా నేతలు ముందుకు సాగాలని ఇటీవలి ఖమ్మం పర్యటనలో కేటీఆర్ చెప్పారని, కేటీఆర్ ఆదేశాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు.
1981లోనే సర్పంచ్‌గా విజయం సాధించిన తాను రాజకీయాల్లో సీనియర్ మోస్ట్నని తాటి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ విషయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకంటే జూనియర్ కిందే లెక్క అని ఆయన కీలక వ్యాఖ్య చేశారు. ఇంత సీనియర్ అయిన తనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని, ఇటీవల ఖమ్మంలో జరిగిన రాజ్యసభ సభ్యుల కృతజ్ఞత సభ ఫ్లెక్సీల్లో కనీసం తన ఫొటోను కూడా పెట్టలేదని ఆరోపించారు. అధిష్ఠానం తక్షణమే స్పందించి పరిస్థితిని చక్కదిద్దకపోతే తాను పార్టీని వీడతానని తాటి వెంకటేశ్వర్లు ప్రకటించారు.