Tollywood: రేపటి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్
- వేతనాల పెంపు కోసం సమ్మె బాట పట్టిన సినీ కార్మికులు
- 24 సంఘాలతో నిర్మాతల మండలి చర్చలు విఫలం
- వేతన సవరణ జరిగేదాకా సమ్మె చేస్తామన్న తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్
- రేపటి నుంచే సమ్మె మొదలవుతుందని ప్రకటన
తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్‌లో బుధవారం నుంచి సినిమా షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఓ కీలక ప్రకటన చేసింది. సినీ కార్మికులకు వేతనాలు పెంచాలంటూ 24 విభాగాలకు చెందిన సిబ్బంది సమ్మె బాట పట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మె కార్యరూపం దాల్చకుండా ఉండేలా నిర్మాతల మండలి సహా పలు సంఘాలు మంగళవారం యత్నించాయి. సమ్మె ప్రతిపాదించిన విభాగాల సంఘాలతో చర్చలు జరిపాయి.
అయితే ఈ చర్చలు మంగళవారం సాయంత్రం దాకా కొనసాగినా... ఫలించలేదు. చర్చలు విఫలమైన నేపథ్యంలో రేపటి నుంచే తెలుగు సినిమా షూటింగ్‌లను బంద్ చేస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. కార్మికుల వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకునేదాకా సమ్మె విరమించేది లేదని కూడా ఫెడరేషన్ తేల్చి చెప్పింది. వేతన సవరణ జరిగేదాకా కొనసాగనున్న సమ్మెలో 24 విభాగాలకు చెందిన కార్మికులు పాలుపంచుకుంటారని ఫెడరేషన్ ప్రకటించింది.