KCR: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు పలికిన కేసీఆర్
- కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేసిన ఎన్సీపీ అధినేత పవార్
- ఒప్పుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి
- ఎన్డీఏ అభ్యర్థిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వనుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జోక్యంతో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అనేక చర్చల తర్వాత శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశంలో విపక్ష నేతలు యశ్వంత్ సిన్హాను పోటీకి దింపేందుకు ఏకగ్రీవంగా అంగీకరించారు. వారంతా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఈ నెల 15న సమావేశమయ్యారు. కానీ, పోటీకి మొదట ఎంపిక చేసిన అభ్యర్థులు నిరాకరించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నే పోటీ పడాలని మమతా బెనర్జీ ఒత్తిడి తెచ్చినా ఆయన ఒప్పుకోలేదు. తర్వాత జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా పోటీకి నిరాకరించారు.
అయితే, ఈ సమావేశానికి ఆహ్వానం అందినప్పటికీ సీఎం కేసీఆర్ గానీ, టీఆర్ఎస్ ప్రతినిధి గానీ హాజరు కాలేదు. దాంతో, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తటస్థ వైఖరి తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది. విపక్షాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండటంతో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో అభ్యర్థి పేరును ప్రకటించే ముందు ప్రతిపక్షాలు పరస్పరం సంప్రదింపులు జరపాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారని, అందుకే మమత ఏర్పాటు చేసిన భేటీకి దూరంగా ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే ముందే సీఎం కేసీఆర్ మద్దతు కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తానే కేసీఆర్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని కోరగా.. ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో నిన్న కేసీఆర్ తో పవార్ పలుసార్లు ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం.
మరోవైపు ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ముర్ము పేరు ప్రకటించారు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. జులై 21న కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెల్లడిస్తారు.