WhatsApp: వాట్సాప్ డీపీ, లాస్ట్ సీన్ స్టేటస్.. కావాలనుకున్న వారికే కనబడుతుంది
- ప్రైవసీ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్
- కేవలం కాంటాక్టులో ఉన్న వారికే కనబడేలా పెట్టుకోవచ్చు
- వద్దనుకునే వారికి కనబడకుండా చేసుకోవచ్చు
వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్చర్ (డీపీ), మన గురించిన సమాచారం, చివరిసారిగా వాట్సాప్ ఓపెన్ చేసిన సమయం (లాస్ట్ సీన్ స్టేటస్) వంటివి ఎవరికీ కనబడకుండా దాచుకోవచ్చు. లేకుంటే అందరికీ కనిపిస్తుంటాయి. ఇక లాస్ట్ సీన్ స్టేటస్ కనబడకుండా మనం ఆపేసుకుంటే.. మనకు కూడా మరెవరి లాస్ట్ సీన్ స్టేటస్ కనబడదు. అలా కాకుండా కావాలనుకున్న కొందరికే డీపీ, స్టేటస్ వంటివి కనిపించేలా, మిగతా వారికి కనబడకుండా ఉండేలా వాట్సాప్ సరికొత్త ఆప్షన్లను ప్రవేశపెట్టింది. దీని వల్ల మనం ఇతరుల స్టేటస్ వంటివి కూడా చూసుకోవచ్చు.
నాలుగు రకాల ఆప్షన్లతో..
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం గోప్యత కోసం కొన్ని ఆప్షన్లను ప్రవేశపెడుతున్నట్టు వాట్సాప్ ఇటీవల ప్రకటించింది. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్ లలో నాలుగు రకాల ఆప్షన్లను ఇచ్చింది. ఏ ఆప్షన్ను ఎంచుకుంటే.. ఏ ప్రయోజనం ఉంటుందో వివరించింది.
ఎవ్రీవన్: మీ లాస్ట్ సీన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటో, ఏబౌట్, ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్నారా, లేదా అన్న సమాచారాన్ని అందరికీ చూపిస్తుంది.
మై కాంటాక్ట్స్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే మన వ్యక్తిగత సమాచారం కేవలం మన ఫోన్లో సేవ్ అయి ఉన్న కాంటాక్టు నంబర్ల వారికి మాత్రమే కనిపిస్తుంది.
మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్: ఈ ఆప్షన్లో కూడా మన సమాచారం ఫోన్లో సేవ్ అయి ఉన్న కాంటాక్టులకే కనిపిస్తుంది. అయితే ఇందులో ఏవైనా కొన్ని ఎంపిక చేసిన కాంటాక్ట్ నంబర్ల వారికి మన సమాచారం కనబడకుండా చేసుకోవచ్చు.
నోబడీ: దీనిని ఎంపిక చేసుకోవడం ద్వారా.. లాస్ట్ సీన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటో, ఇతర సమాచారమేదీ ఎవరికీ కనబడకుండా చేసుకోవచ్చు.