Rashid Latif: కోహ్లీ దుస్థితికి రవిశాస్త్రే కారణమంటున్న పాక్ మాజీ క్రికెటర్
- కెరీర్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కోహ్లీ
- రెండేళ్లుగా పేలవ ఆటతీరుతో విమర్శలు
- ఇటీవల ఐపీఎల్ లోనూ విఫలం
- విరామం తీసుకోవాలన్న రవిశాస్త్రి
- విరామం అవసరంలేదన్న రషీద్ లతీఫ్
గత రెండేళ్లుగా విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరు విమర్శలకు పనికల్పిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క సెంచరీ లేకపోగా, కెప్టెన్సీ కూడా పోయింది. ఇటీవల ఐపీఎల్ లోనూ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగింది. ఒకటీ అరా మ్యాచ్ లలో తప్పించి కోహ్లీ రాణించిందే లేదు. రవిశాస్త్రి వంటి ప్రముఖులు కోహ్లీ కొన్నాళ్లు విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు రషీద్ లతీఫ్ స్పందించాడు. కోహ్లీకి ఎలాంటి విరామం అవసరంలేదని అభిప్రాయపడ్డాడు.
అసలు, కోహ్లీ ప్రస్తుత పరిస్థితికి రవిశాస్త్రినే కారణమని లతీఫ్ ఆరోపించాడు. రవిశాస్త్రి కోచ్ కాకుండా ఉంటే బాగుండేదని అన్నాడు. "గతంలో ఏం జరిగింది...? అనిల్ కుంబ్లే వంటి గొప్ప ఆటగాడ్ని కోచ్ గా తప్పించారు. అతడి స్థానంలో రవిశాస్త్రి వచ్చాడు. అతడికి కోచ్ గా సామర్థ్యం ఉందో, లేదో నాకైతే తెలియదు. అతడో టెలివిజన్ వ్యాఖ్యాత. కోచ్ గా పనిచేయాల్సిన అవసరం అతడికి ఎంతమాత్రం లేదు. కొందరు రవిశాస్త్రిని కోచ్ గా తీసుకువచ్చారు. అప్పట్లో ఈ నిర్ణయం ఎంతో విమర్శపాలైంది" అంటూ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. అయితే, కోహ్లీ ఫామ్ రవిశాస్త్రి కారణంగా ఏవిధంగా ప్రభావితమైందన్నది మాత్రం లతీఫ్ వివరించలేదు.