Virat Kohli: విరాట్​ కోహ్లీకి కరోనా.. కోలుకొని ఇంగ్లండ్​కు.. ఆలస్యంగా వెలుగులోకి విషయం

Virat Kohli Tested Covid Positive After Maldives Vacation
  • ఇటీవల మాల్దీవ్స్ లో కోహ్లీ విహారయాత్ర
  • తిరిగొచ్చిన తర్వాత కరోనా సోకినట్టు వార్తలు
  • కోలుకొని ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విరాట్
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా బారిన పడి, కోలుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైరస్ నుంచి అతను త్వరగానే కోలుకున్నాడు. ఇంగ్లండ్ తో  టెస్టు మ్యాచ్ కోసం భారత జట్టు  లండన్ బయల్దేరే ముందు చేసిన పరీక్షల్లో కరోనా సోకిన స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ భారత్  లోనే ఉండిపోయాడు. మరోపక్క కోహ్లీ కూడా వైరస్ బారిన పడడం ఆందోళన కలిగించింది.  

ఐపీఎల్ అనంతరం విశ్రాంతి తీసుకున్న కోహ్లీ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఈ సమయంలో అతను కుటుంబ సభ్యులతో కలిపి  మాల్దీవ్స్ విహారయాత్రకు వెళ్లాడు.  అక్కడి నుంచి తిరిగొచ్చాకే  కోహ్లీ  కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ముంబైలో విరాట్ ఓ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నటు సమాచారం. అయితే, కొవిడ్ నుంచి తొందరగానే కోలుకున్న కోహ్లీ ఈ నెల 16వ తేదీన భారత టెస్టు జట్టుతో పాటు ఇంగ్లండ్‌ వెళ్లాడు. కానీ, విరాట్ వైరస్ బారిన విషయాన్ని బీసీసీఐ వెల్లడించలేదు.

 పైగా, ఇంగ్లండ్  పర్యటనలో భారత క్రికెటర్లంతా రద్దీ ప్రాంతాల్లో షాపింగ్ చేస్తూ.. అభిమానులతో ఫొటోలు దిగుతూ కనిపించారు. కోహ్లీ,  రోహిత్‌ శర్మతో అభిమానులు సెల్ఫీలు తీసుకుంటున్న ఫొటోలు వైరల్ అవ్వడంతో బీసీసీఐ వారిని హెచ్చరించింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీ ప్రాంతాల్లోకి  మాస్కులు లేకుండా వెళ్లొద్దని సూచించింది. అభిమానులకు దూరంగా ఉండాలని చెప్పింది. 

ఇదిలా ఉండగా భారత్- ఇంగ్లండ్ మధ్య జులై 1వ తేదీ నుంచి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం సన్నద్దం అయ్యేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు.. లీసెస్టర్ షైర్ కౌంటీ క్రికెట్ జట్టుతో గురువారం నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
Virat Kohli
COVID19
Corona Virus
Team India
englad
BCCI

More Telugu News