Long Covid: పిల్లలకు కరోనా.. రెండు నెలల పాటు సమస్యలు
- మానసిక ధోరణుల్లో మార్పులు
- చర్మంపై దద్దుర్లు, కడుపులో నొప్పి
- అలసట, గుర్తు పెట్టుకోలేకపోవడం
- కరోనా దీర్ఘకాలిక ప్రభావాలపై తాజా అధ్యయనం
చిన్నారులకు కరోనా వైరస్ సోకితే తదనంతరం రెండు నెలల పాటు దాని తాలూకూ ప్రభావం కొనసాగుతున్నట్టు ఓ అధ్యయనం గుర్తించింది. ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్ చైల్డ్ అండ్ అడోల్సెంట్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. 0-14 ఏళ్ల మధ్యనున్న చిన్నారులపై సుదీర్ఘకాలం పాటు ఈ అధ్యయనం జరిగింది. ఎటువంటి వ్యాధుల్లేని చిన్నారుల డేటాను, కరోనా బారిన పడిన చిన్నారుల డేటాను విశ్లేషించిన పరిశోధకులు చాలా విషయాలు తెలుసుకున్నారు.
‘‘శిశువులు, చిన్నారులపై కరోనా వైరస్ ప్రాబల్యం ఎంత కాలం పాటు ఉంటుందని తెలుసుకోవడమే మా అధ్యయనం ఉద్దేశ్యం. అలాగే, జీవన నాణ్యత, పాఠశాలలకు వెళ్లలేకపోవడాన్ని కూడా తెలుసుకున్నాం’’ అని డెన్మార్క్ లోని కోపెన్ హేజెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సెలీనా బెర్గ్ వెల్లడించారు.
‘‘కరోనా సోకని చిన్నారులతో పోలిస్తే.. వైరస్ బారిన పడిన చిన్నారుల్లో ఆ లక్షణాలు చాలా రోజుల పాటు ఉంటున్నట్టు తెలిసింది. చిన్నారులపై అన్ని రకాలుగా ప్రభావం చూపిస్తోంది’’ అని బెర్గ్ వివరించారు. మొత్తం 11,000 మంది చిన్నారుల డేటా ఆధారంగా పరిశోధకులు ఈ ఫలితాలను ప్రకటించారు.
0-3 ఏళ్ల చిన్నారుల్లో మానసిక స్థితిలో మార్పు, చర్మంపై దద్దుర్లు, కడుపులో నొప్పి రావడాన్ని గుర్తించారు. 4-11 ఏళ్ల పిల్లల్లో మూడ్ పరమైన మార్పులు, ఏకాగ్రత లోపించడం, గుర్తు పెట్టుకోలేకపోవడం, దద్దుర్లు ఉంటున్నట్టు తెలిసింది. ఇక 12-14 ఏళ్ల పిల్లలకు ఎక్కువ రోజుల పాటు అలసట, ప్రవర్తనలో మార్పులు, గుర్తు పెట్టుకోలేకపోవడం, ఏకాగ్రత లోపించడాన్ని గుర్తించారు.