President Of India: ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి వైసీపీ మద్దతు.. నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ ఎంపీల హాజరు
- నేడు ముర్ము నామినేషన్ కు హాజరుకానున్న విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి
- కేంద్ర ప్రభుత్వంతో జగన్ కు ముందు నుంచి సత్సంబంధాలు
- 2017 రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకే మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించినట్లే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బహిరంగ మద్దతు ప్రకటించింది. శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత మిథున్ రెడ్డి హాజరు కానున్నారు.
ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారని వైసీపీ తెలిపింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తొలిసారిగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని అభిప్రాయపడింది.
కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ముందునుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 2017 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సహకరించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన పలు బిల్లులకు కూడా వైసీపీ మద్దతు ఇస్తూ వచ్చింది. దాంతో, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో వైసీపీ మద్దతు అధికార బీజేపీకి చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జగన్ పార్టీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు వున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ 53,313గా ఉంటే అందులో మెజారిటీ వంతు వైసీపీదే. దాంతో, జగన్ మద్దతిస్తే తమ అభ్యర్థి విజయం సులువవుతుందని బీజేపీ అధిష్ఠానం ముందు నుంచి నమ్మకంగా ఉంది. మరోవైపు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. ఆయన 27న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఈ నెల 29తో గడువు ముగియనున్నది. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరుగనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.