Gautam Adani: సమాజ సేవకు గౌతమ్ అదానీ కుటుంబం రూ.60,000 కోట్ల భూరి విరాళం
- రూ.60 వేల కోట్లను ఇవ్వాలని నిర్ణయం
- గౌతమ్ అదానీ 60వ పుట్టిన రోజున ప్రకటన
- ఆరోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణపై వినియోగం
‘సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడు పడవోయ్..’ సంఘ సంస్కర్త, కవి గురజాడ అప్పారావు చెప్పిన సూక్తి ఇది. ఎప్పుడూ తన కోసమే కాకుండా సమాజం కోసం కూడా కొంత ఆలోచించాలని, కొంత సాయం చేయాలన్నది ఆయన హితవు. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ అదానీ దీనినే అనుసరించారు. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా రూ.60,000 కోట్లను సమాజ సేవకు ఇస్తున్నట్టు ప్రకటించారు. గురువారం అదానీ పుట్టిన రోజు.
అదానీ, తన కుటుంబంతో కలసి రూ.60 వేల కోట్ల మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ కు బదలాయించనున్నారు. అదానీ ఫౌండేషన్ ఈ నిధులను ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై ఖర్చు చేయనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవల కోసం నిధులు వెచ్చించనుంది. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ 100వ జయంతి ఈ ఏడాదే. ఇదే ఏడాది తన 60వ పుట్టిన రోజు అయినందున సమాజ సేవ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌతమ్ అదానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ భారత్ నుంచి అత్యంత సంపన్నులుగా ఉన్న విషయం తెలిసిందే.