India Aid: భూకంప బాధిత ఆఫ్ఘనిస్థాన్ ​కు తొలుత సాయం అందించింది భారత దేశమే!

India was the first country to send aid to earthquake hit Afghanistan
  • సహాయ సామగ్రి తరలింపుపై విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి ట్వీట్
  • దానిని రీట్వీట్ చేసిన విదేశాంగ మంత్రి జై శంకర్
  • ఆఫ్ఘనిస్థాన్ లో చాలా దారుణంగా పరిస్థితి
తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్థాన్ కు మొట్ట మొదట భారత దేశమే సాయం అందించింది. ఆహారం, అత్యవసర మందులు, ఇతర పరికరాలు, సహాయ సామగ్రితో కూడిన విమానాలు నిన్న (గురువారం) రాత్రే ఆ దేశ రాజధాని కాబూల్ కు చేరుకోగా.. ఈ రోజు ఉదయం మరో విమానంలో మరింత సహాయ సామగ్రిని తరలించారు. 

ఈ సాయంతోపాటు పలువురు సాంకేతిక, వైద్య నిపుణులతో కూడిన బృందం కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ వివరాలతో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ ట్వీట్ చేయగా.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ రీ ట్వీట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ కు మొట్ట మొదట సాయాన్ని పంపింది భారతదేశమేనని ఆయన పేర్కొన్నారు. 

అత్యంత దయనీయంగా పరిస్థితి
కొన్నేళ్లుగా అంతర్గత తిరుగుబాట్లు, ఉగ్రవాద దాడులతో అల్లకల్లోలమైన ఆఫ్ఘనిస్తాన్ లో.. అమెరికా, సంకీర్ణ దేశాల దళాలు వెళ్లిపోయినప్పటి నుంచి పరిస్థితి దారుణంగా మారింది. దానికితోడు ఇప్పుడు ఈ భూకంపంతో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూకంపంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా.. వేలాది మంది గాయపడ్డారు. 

మరోపక్క, అక్కడి జ్ఞాన్ అనే గ్రామంలో ఆసుపత్రి కూడా కూలిపోయింది. వైద్య సేవలు సరిగా అందే పరిస్థితి లేకుండా పోయింది. కేవలం ఐదు బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంటే.. 500 మందికిపైగా క్షతగాత్రులు వచ్చారని, చికిత్స అందించలేకపోవడంతో అందులో 200 మంది చనిపోయారని ఆసుపత్రి వైద్యులు చెప్పడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.
India Aid
Afghanistan
Earth quake
External affires minister
Jai shankar

More Telugu News