WHO: మంకీపాక్స్ అంటు వ్యాధేనా.?.. తేల్చనున్న డబ్ల్యూహెచ్ వో
- అత్యవసర సమావేశం ఏర్పాటు
- వైరస్ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకోనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- అంటు వ్యాధిగా ప్రకటిస్తే నివారణకు మరిన్ని చర్యలు
మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికి 42 దేశాలకు ఇది పాకిపోయింది. 3,417 కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, పౌర బృందాలను సమన్వయపరిచే వరల్డ్ హెల్త్ నెట్ వర్క్ అయితే దీన్ని అంటు వ్యాధి (మహమ్మారి/ప్యాండెమిక్)గా ప్రకటించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) సంస్థ సైతం మంకీపాక్స్ ను అంటు వ్యాధిగా ప్రకటించాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
నిజానికి ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా మారే అంటు వ్యాధులనే ప్యాండెమిక్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తుంది. మంకీపాక్స్ వైరస్ చూడ్డానికి అంత వేగంగా, విస్తృతంగా వ్యాపించే అవకాశాల్లేవన్నది నిపుణుల అభిప్రాయం. ప్యాండెమిక్ గా ప్రకటిస్తే, ప్రజారోగ్య అత్యవసర స్థితిని ప్రకటించినట్టుగా అర్థం చేసుకోవాలి. కానీ, ఈ నిర్ణయం తీసుకోవడానికి డబ్ల్యూ హెచ్ వో మరింత సమయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఒకవేళ డబ్యూహెచ్ వో ప్యాండెమిక్ గా ప్రకటిస్తే ప్రపంచవ్యాప్తంగా వైద్యులు మరింత అప్రమత్తమై నివారణ దిశగా సమష్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మంకీపాక్స్ సన్నిహితంగా మెలగడం ద్వారానే వ్యాపిస్తున్నందున ఇది మహమ్మారిగా రూపాంతరం చెందకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇన్ఫెక్షన్ కు గురైన వ్యక్తితో సన్నిహితంగా మెలిగితే తప్పించి, గాలి ద్వారా వ్యాపించేది కాకపోవడం ఊరటనిచ్చే విషయం.