TPCC President: చంచల్‌గూడ జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి... 'అగ్నిపథ్' అల్లర్ల నిందితులతో ములాఖత్
- చంచల్‌గూడ జైల్లో అగ్నిపథ్ అల్లర్ల నిందితులు
- వారితో ములాఖత్ కోసం జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి
- కేసులతో యువత భయపడుతోందన్న టీపీసీసీ చీఫ్
- యువకుల్లో భరోసా కల్పించేందుకే వచ్చామని ప్రకటన
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, మల్‌రెడ్డి రంగారెడ్డిలతో కలిసి జైలుకు వెళ్లిన ఆయన అక్కడ రిమాండ్ ఖైదీలుగా ఉన్న అగ్నిపథ్ అల్లర్ల నిందితులతో ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన జైలు బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
అగ్నిపథ్ పథకాన్ని వ్యరేతికించారన్న ఆరోపణలతో వందలాది మంది యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారని, వారందరినీ జైలులో పెట్టారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఉన్న ఆ యువకులంతా ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నారని ఆయన అన్నారు. కేసులు నమోదు కావడంతో యువకులంతా తమ భవిష్యత్తు గురించి భయపడుతున్నారని చెప్పారు. వారందరికీ తాము భరోసా కల్పించే యత్నం చేశామని రేవంత్ తెలిపారు.