YSRCP: రాజ్యసభ సభ్యుడిగా ఆర్.కృష్ణయ్య ప్రమాణం... ఆ వెంటనే జంతర్ మంతర్ వద్ద ధర్నా
- ఇటీవలే వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య
- వెంకయ్య సమక్షంలో ప్రమాణం చేసిన బీసీ సంఘం నేత
- 47 ఏళ్లుగా ఆయుధం లేకుండా పోరాటం చేశానన్న కృష్ణయ్య
- క్రిమీ లేయర్ ఎత్తివేసేదాకా పోరాటమేనని వెల్లడి
వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శుక్రవారం ఎంపీగా పదవీ ప్రమాణం చేశారు. పార్లమెంటులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆర్.కృష్ణయ్యతో పాటు వైసీపీ తరఫుననే ఎంపీగా ఎన్నికైన న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక వీరిద్దరితో పాటు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావులు ఎప్పుడు ప్రమాణం చేస్తారన్న విషయం తెలియరాలేదు.
ఇదిలా ఉంటే... ఆది నుంచీ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పోరాటం సాగిస్తున్న ఆర్.కృష్ణయ్య... శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగగా... పార్లమెంటులో ప్రమాణ స్వీకారం ముగిసిన మరుక్షణమే ఆర్.కృష్ణయ్య ఆ ధర్నాలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం గడచిన 47 ఏళ్లుగా ఆయుధం లేకుండానే పోరాడుతున్నానని చెప్పారు. ఇప్పుడు జగన్ తనకు రాజ్యసభ సభ్యత్వం అనే ఆయుధాన్నిచ్చారని ఆయన పేర్కొన్నారు. క్రిమీ లేయర్ ఎత్తివేసే దాకా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన ప్రకటించారు.