Chinmayi Sripada: అసభ్య చిత్రాలు పంపిన పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు: చిన్మయి శ్రీపాద
- మీటూ ఉద్యమానికి ప్రోత్సాహం అందించిన చిన్మయి
- అప్పట్లో తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు
- మరోసారి వార్తల్లోకెక్కిన చిన్మయి
- వేధిస్తున్న వారి అకౌంట్లు ఉంచారని వెల్లడి
- తన అకౌంట్ తొలగించారని ఆవేదన
తమిళ సినీ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి మీటూ ఉద్యమానికి ప్రోత్సాహం అందించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి వార్తల్లోకెక్కారు. తన సోషల్ మీడియా ఖాతాకు కొందరు పురుషులు తమ ప్రైవేట్ పార్టులకు చెందిన ఫొటోలు పంపారని, వారిపై తాను ఫిర్యాదు చేస్తే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలపివేశారని చిన్మయి వెల్లడించారు. వారు తమ అశ్లీల ఫొటోలను నేరుగా తన ఇన్ బాక్స్ కే మెసేజ్ చేశారని వివరించారు.
ఇది కొన్నాళ్లుగా జరుగుతోందని, దీనిపై ఫిర్యాదు చేయగానే, తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రాథమికంగా సస్పెండ్ చేశారని చిన్మయి పేర్కొన్నారు. ప్రస్తుతం chinmayai.sripada అనే బ్యాకప్ అకౌంట్ తో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలిపారు. ఈ తాత్కాలిక అకౌంట్ ద్వారా చిన్మయి తన ఆవేదన వెలిబుచ్చారు. వేధింపులకు పాల్పడుతున్నవారి అకౌంట్లు అలాగే ఉంచి, ఎలుగెత్తిన వారి అకౌంట్ ను తొలగించారని ఆక్రోశించారు. చిన్మయి శ్రీపాద ఇటీవల కవలలకు జన్మనివ్వడం తెలిసిందే.