Ramiz Raja: ఐపీఎల్ ఫైనల్స్ కు రావాలంటూ గంగూలీ నన్ను ఆహ్వానించాడు... కానీ!: రమీజ్ రాజా

Ramiz Raja says Ganguly has invited him twice for IPL Finals

  • రెండుసార్లు పిలిచాడన్న రమీజ్ రాజా
  • గతేడాది కూడా ఆహ్వానం అందిందని వెల్లడి
  • పరిస్థితుల కారణంగా తాను వెళ్లలేదని వివరణ

పాకిస్థానీ క్రికెటర్లు, మాజీలు ఏదో ఒకరూపంలో ఐపీఎల్ ప్రస్తావన తీసుకురాకుండా ఉండలేరు. తాజాగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీర్ రాజా కూడా ఐపీఎల్ నేపథ్యంలో స్పందించారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్స్ కు రావాలంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తనను కూడా ఆహ్వానించాడని రమీజ్ రాజా వెల్లడించాడు. అయితే, వివిధ కారణాల రీత్యా తాను హాజరు కాలేదని తెలిపాడు. 

"గంగూలీ నన్ను రెండుసార్లు ఆహ్వానించాడు. గతేడాది, ఈ ఏడాది ఫైనల్స్ కు పిలిచాడు. క్రికెట్ పరంగా చూస్తే గంగూలీ ఆహ్వానాలను మన్నించి ఐపీఎల్ ఫైనల్స్ కు వెళ్లాల్సిందే. కానీ పరిస్థితుల పరంగా చూస్తే, ఐపీఎల్ ఫైనల్స్ కు వెళ్లడం వల్ల కలిగే పర్యవసానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వెళ్లలేదు" అని రమీజ్ రాజా వివరణ ఇచ్చాడు. 

అంతేకాదు, రాజకీయ సమీకరణాల వల్ల భారత్, పాక్ క్రికెట్ సంబంధాలకు ఆటంకాలు ఏర్పడడంపైనా రమీజ్ రాజా స్పందించాడు. "ఈ విషయం కూడా నేను గంగూలీతో మాట్లాడాను. ప్రస్తుతం ముగ్గురు మాజీ క్రికెటర్లు తమ తమ దేశాల క్రికెట్ బోర్డులకు నాయకత్వం వహిస్తున్నారు. వాళ్లే చొరవ తీసుకుని క్రికెట్ సంబంధాల మెరుగుకు కృషి చేయకపోతే ఇంకెవరు చేస్తారు?" అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక, వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ నిడివి రెండున్నర నెలలకు పెరగనుందన్న ప్రతిపాదనలపై తన వాదనలను ఐసీసీ సమావేశంలోనే వెల్లడిస్తానని రమీజ్ రాజా స్పష్టం చేశారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానందున, ఇప్పుడే స్పందించలేనని అన్నారు.

  • Loading...

More Telugu News