Team India: హమ్మయ్య పంత్ ఫామ్​ లోకి వచ్చాడు... భారత జట్టుకు​ హ్యాపీ!

Rishabh pant gets his form  back with attacking batting

  • ఐపీఎల్, దక్షిణాఫ్రికాతో సిరీస్ లో నిరాశ పరిచిన రిషబ్
  • ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ ముంగిట పుంజుకున్న కీపర్
  • ప్రాక్టీస్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ

ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ ముంగిట భారత క్రికెట్ జట్టుకు శుభ పరిణామం. ఐపీఎల్‌తో పాటు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహంగా భారత టెస్టు జట్టు, లీస్టర్‌షైర్‌ మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో లీస్టర్‌షైర్‌ తరఫున బరిలోకి దిగిన రిషబ్‌.. తనదైన శైలిలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో 76 పరుగులు చేసిన అతను.. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకున్నాడు. 
  
 తొలి రోజు చేసిన 246/8 స్కోరు వద్దనే భారత్ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. రెండో రోజైన శుక్రవారం లీస్టర్‌షైర్‌ కు బ్యాటింగ్ అప్పగించింది. పంత్ రాణించడంతో లీస్టర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. పంత్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చటేశ్వర్‌ పుజారా (0) డకౌటై నిరాశ పరిచాడు. మరోవైపు భారత బౌలర్లు కూడా ఆకట్టుకున్నారు. సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ (3/42) మూడు వికెట్లు పడగొట్టగా...మహ్మద్‌ సిరాజ్‌ (2/46), శార్దూల్‌ ఠాకూర్‌ (2/71) రెండేసి వికెట్లు తీశారు. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (3/28) కూడా చివర్లో చకచకా మూడు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం రెండు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ రెండో రోజు చివరకు 18 ఓవర్లలో 80/1 స్కోరు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ  తాను ఓపెనర్ శ్రీకర్‌ భరత్‌ను పంపాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి జట్టును ఆదుకున్న తెలుగు కుర్రాడు భరత్‌.. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని సత్తా చాటాడు. 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (38) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేక 14వ ఓవర్లోనే ఔటయ్యాడు. ప్రస్తుతం భరత్‌, హనుమ విహారి (9 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత జట్టు 82 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

  • Loading...

More Telugu News