Teesta Setalvad: గుజరాత్ అల్లర్లపై సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలు.. సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ అరెస్ట్

Activist Teesta Setalvad arrested by Gujarat ATS

  • సీతల్వాడ్‌పై షా విరుచుకుపడిన కొన్ని గంటల్లోనే అరెస్ట్
  • ఈ కేసును సీతల్వాడ్ తన స్వప్రయోజనాల కోసం వాడుకున్నారన్న సుప్రీంకోర్టు
  • శ్రీకుమార్ అరెస్ట్‌పై హర్షం వ్యక్తం చేసిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబియార్
  • తనకు ప్రాణహాని ఉందన్న సీతల్వాడ్

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి తప్పుడు సమాచారం ఇచ్చిన ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) నిన్న అరెస్ట్ చేసింది. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. అల్లర్ల విషయంలో వారంతా సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని, కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన అధికారులను జైలులో పెట్టాలని పేర్కొంది. తీస్తా సీతల్వాడ్ ఈ కేసును సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని, ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న మాట్లాడుతూ.. గుజరాత్ అల్లర్లపై కొందరు విష ప్రచారం చేశారని, కావాలనే మోదీపై విమర్శలు చేశారని అన్నారు. గుజరాత్ అల్లర్ల కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సీతల్వాడ్‌ పైనా షా విరుచుకుపడ్డారు. తీస్తా వంటి కొందరు ఎన్జీవోలు, ఒక సిద్ధాంతంతో రాజకీయం చేయాలని బయల్దేరిన జర్నలిస్టులు, బీజేపీ వ్యతిరేకులు కుమ్మక్కై అబద్ధాలను సత్యాలుగా ప్రచారం చేశారని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే తీస్తా సీతల్వాడ్‌, మాజీ డీజీపీ శ్రీకుమార్, మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌పై గుజరాత్ ఏటీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సంజీవ్ భట్ మరో కేసులో ఇప్పటికే జైలులో ఉండగా, శ్రీకుమార్, తీస్తా సీతల్వాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరణశిక్ష విధించడానికి అవకాశమున్న నేరంలో కొందరిని దోషులుగా ఇరికించేందుకు సీతల్వాడ్‌, సంజీవ్‌‌భట్‌, శ్రీకుమార్‌ కుట్ర పూరితంగా తప్పుడు సాక్ష్యాలను పుట్టించారని క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ డీబీ బారాద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన అరెస్టును సీతల్వాడ్ ఖండించారు. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శ్రీకుమార్ అరెస్ట్ తనకు సంతోషాన్నించిందని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పేర్కొన్నారు. 1994లో ఇస్రో నుంచి పాకిస్థాన్‌కు సమాచారం లీక్ చేసిన కేసులో నంబి నారాయణన్‌ను అప్పట్లో అక్రమంగా అరెస్ట్ చేశారు. 1995లో నారాయణన్‌కు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. శ్రీకుమార్ అరెస్ట్‌పై తాజాగా మాట్లాడిన నంబి నారాయణన్.. శ్రీకుమార్ తనను కూడా బలిచేశారని అన్నారు. తప్పుడు ఆధారాలు సృష్టించడంలో ఆయన దిట్ట అని ఆరోపించారు.

  • Loading...

More Telugu News