Telangana: తెలంగాణలో 19 లక్షల రేషన్ కార్డులు రద్దు.. దర్యాప్తు చేయాలంటూ మానవ హక్కుల సంఘానికి బండి సంజయ్ లేఖ
- రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఫిర్యాదు
- అర్హులకు కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేసి పేద ప్రజలను ఇబ్బంది పెడుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. రేషన్ కార్డుల తొలగింపు సరికాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రేషన్ కార్డుల రద్దు, కొత్త కార్డుల మంజూరుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు 19 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసిందని ఆరోపించారు.
కొత్త కార్డుల కోసం ఏకంగా 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. అర్హత ఉన్న పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అసలు 19 లక్షల రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేశారనే దానిపై విచారణ చేయాలని.. కొత్త రేషన్ కార్డులను ఎందుకు మంజూరు చేయడం లేదో దర్యాప్తు చేయాలని కోరారు.