Amaravati: మరి ‘గ్రాఫిక్స్’ను లీజుకెలా ఇస్తారు?: ప్రభుత్వంపై రాజధాని రైతుల ఆగ్రహం
- ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని అద్దెకు ఎలా ఇస్తారని రైతుల ప్రశ్న
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిపై విష ప్రచారం చేశారన్న లోకేశ్
- వచ్చాక శ్మశానం అన్నారని గుర్తు చేసిన టీడీపీ నేత
- ఇప్పుడు ఎకరా భూమిని రూ. 10 కోట్లకు అమ్మకానికి పెట్టారని విమర్శ
అమరావతిలో గ్రూప్-డి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న భవన సముదాయాన్ని అద్దెకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. అమరావతిని రాజమౌళి సినిమాలోని గ్రాఫిక్స్ అంటూ అవహేళన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు వాటిని అద్దెకు ఎలా ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న వాటిని ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇవ్వాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్ముకోవడం, అద్దెకు ఇచ్చుకోవడం, తనఖా పెట్టడం తప్ప ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ లేదన్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. అమరావతిని నాడు శ్మశానం అన్న వైసీపీ నేతలు నేడు ఎకరా భూమిని పది కోట్ల రూపాయలకు అమ్మకానికి ఎలా పెట్టారని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అమరావతిపై కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. అప్పట్లో అమరావతికి వరదలని, భూకంపాల ముప్పు అనీ ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక శ్మశానం అన్నారనీ గుర్తు చేశారు. ఇప్పుడేమో ఎకరం రూ. 10 కోట్లకు అమ్మకానికి ఎలా పెట్టారని లోకేశ్ ప్రశ్నించారు.