Rohit Sharma: ఇంత నిర్లక్ష్యమా?... రోహిత్‌పై బీసీసీఐ పెద్దల గుర్రు!
- రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దని, మాస్కు మరవొద్దని ముందే సూచన
- వాటిని పట్టించుకోని రోహిత్, కోహ్లీ, పంత్ తదితరులు
- అందుకే రోహిత్ కరోనా బారిన పడ్డాడని బోర్డు ఆగ్రహం
భారీ అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ పర్యటనకు దూరంగా ఉండగా.. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్ గా తేలి ఇంగ్లండ్ తో జులై 1వ తేదీ నుంచి జరిగే టెస్టు మ్యాచ్ కు దూరం అవబోతున్నాడు. రోహిత్ కరోనా బారిన పడటం అతని స్వయంకృతమే.
ఇంగ్లండ్ చేరుకున్న వెంటనే రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లు అక్కడి రద్దీ ప్రాంతాల్లో తిరిగారు. మాస్కులు లేకుండా అభిమానులతో సెల్ఫీలు దిగారు. బీసీసీఐ, జట్టు వైద్య బృందం సలహాలను పట్టించుకోకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతూ అభిమానులతో ముచ్చటించారు. ఫలితంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాజిటివ్ గా తేలాడు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన రోహిత్, ఇతరులపై బోర్డు పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జట్టును నడిపించాల్సిన నాయకుడే ఇలా వ్యవహరించడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
‘ఇది చాలా బాధ్యతారాహిత్య చర్య. ముప్పు గురించి వారికి తెలియజేశాం. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరగొద్దని సూచించాం. కానీ రోహిత్, విరాట్, రిషబ్ తో పాటు అందరూ ఈ సలహాలను విస్మరించారు. అందుకే రోహిత్ పాజిటివ్ గా తేలాడు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెప్టెన్, ఇతర ఆటగాళ్లపై బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.