UP woman: ప్రకృతి విరుద్ధమైన బంధం వద్దన్నారని లింగమార్పిడి
- ఇద్దరు మహిళల మధ్య లెస్బియన్ సంబంధం
- కలసి జీవించేందుకు పెద్దల నిరాకరణ
- ఇద్దరిలో ఒకరు పురుషుడిగా మారాలని నిర్ణయం
- ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రిలో సర్జరీ
- ఏడాదిన్నర తర్వాతే పూర్తిస్థాయి పురుషుడిగా మార్పు
ప్రకృతి విరుద్ధమైన బంధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. కాకపోతే మన భారత సమాజంలో ఈ ధోరణులు చాలా తక్కువ. కానీ, సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఇటీవలి కాలంలో మన దగ్గరా ఈ ధోరణులు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ.. మరో మహిళతో బంధానికి వీలుగా లింగమార్పిడి చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే..
ప్రయాగ్ రాజ్ కు చెందిన ఇద్దరు మహిళల మధ్య సన్నిహిత సంబంధం (లెస్బియన్) ఏర్పడింది. జీవితాంతం ఇద్దరూ కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, వారి కుటుంబాలు ఈ బంధానికి అంగీకరించలేదు. దీంతో ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగ మార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఎవరూ అడ్డు చెప్పరని భావించింది. ఇరువైపుల కుటుంబాలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరిగా లింగమార్పిడి మార్గాన్ని ఎంపిక చేసుకుంది.
ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్ కు చెందిన వైద్యుల బృందం లింగమార్పిడి శస్త్రచికిత్స (సెక్స్ రీ అసైన్ మెంట్) సర్జరీని పాక్షికంగా నిర్వహించింది. పూర్తి స్థాయి పురుషునిగా మార్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పడుతుందని డాక్టర్ మోహిత్ తెలిపారు. ఆమెకు టెస్టో స్టెరాన్ రీప్లెస్ మెంట్ థెరపీ ఇస్తామని చెప్పారు. అయినా, సంతానానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు.