CM Jagan: శ్రీకాకుళంలో అమ్మ ఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్
- మూడో విడత అమ్మ ఒడి నిధుల విడుదల
- 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ
- ఒక్క బటన్ క్లిక్ తో రూ.6,595 కోట్లు విడుదల
- ఇప్పటివరకు అమ్మ ఒడి కింద రూ.19,618 కోట్లు విడుదల
ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళంలో నిర్వహించిన సభలో అమ్మ ఒడి మూడో విడత నిధులను విడుదల చేశారు. ఒక్క బటన్ క్లిక్ తో 40 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,595 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, జగనన్న అమ్మ ఒడి అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మ ఒడి పథకం కింద ఇప్పటిదాకా రూ.19,618 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
పిల్లలను బడికి పంపిస్తున్న ప్రతి తల్లి ఖాతాలో నగదు జమ చేస్తున్నామని, దాదాపు 80 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు విద్య అందాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని, మంచి చదువు హక్కుగా అందించాలన్నదే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు చదువు మధ్యలో ఆపకూడదని కోరుకుంటున్నామని తెలిపారు. బాగా చదవాలన్న ఉద్దేశంతోనే 75 శాతం హాజరు తప్పనిసరి చేశామని సీఎం జగన్ వివరించారు.
కాగా, పాఠశాలలు, టాయిలెట్ మెయింటెనెన్స్ కింద కొద్దిగా సొమ్ము వసూలు చేస్తున్నామని, రూ.2 వేలు వసూలు చేస్తుంటే కొందరు విమర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
అంతకుముందు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అమ్మ ఒడి కార్యక్రమం ఓ అద్భుతం అని అభివర్ణించారు. గతంలో ఎన్నడూ విద్య కోసం ఇంత భారీగా ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలన్నదే సీఎం జగన్ ఆశయం అని వెల్లడించారు. విద్యార్థులు మంచి చదువులు చదువుకోవాలన్నది ఆయన బలంగా కోరుకుంటున్నారని వివరించారు. తాము అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం వెనుక దీర్ఘకాలిక ఆలోచన ఉందని అన్నారు.