Chandrababu: అమరావతికి ఒక్క ఇటుకా పెట్టని జగన్ కు భూములమ్మే హక్కు ఎక్కడిది?: చంద్రబాబు

Chandrababu angry over land sale in Amravati

  • అమరావతిని శ్మశానమని ఇప్పుడు ఎకరా పది కోట్లకు అమ్ముతారా? అంటూ బాబు ప్రశ్న 
  • ప్రభుత్వ భవనాలను అద్దెకు ఇవ్వడం దారుణమని వ్యాఖ్య 
  • అడ్డగోలు పన్నులతో ప్రజలను దోచుకుంటన్నారని విమర్శ 
  • పథకాలకు కోతలు పెడుతూ డబ్బులు మిగుల్చుకుంటున్నారని మండిపాటు

ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భూముల అమ్మకంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లూ అమరావతిని శ్మశానమంటూ వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే భూములను ఎకరానికి రూ. పది కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతోందని ప్రశ్నించారు. పార్టీ కీలక నేతలతో సమావేశమై చర్చించిన సందర్భంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ విధానాలపై చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని సీఎం జగన్‌కు ఇక్కడి భూములను అమ్మే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం తాము చేపట్టిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా వదిలేశారని విమర్శించారు. అలాంటిది ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డబ్బు పంచినా ఓట్లు పెరగలేదు
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ డబ్బులు పంచినా ఓట్లను పెంచుకోలేకపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఉప ఎన్నికలో ఆ పార్టీకి కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదని గుర్తు చేశారు. అసలు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా ఓట్లు పెరగకపోవడానికి.. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

అటు పన్నుల వాతలు.. ఇటు పథకాలకు కోతలు
జగన్ పాలన అటు పన్నులతో వాతలు.. ఇటు పథకాలకు కోతలు అనేలా సాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. పథకాల్లో వివిధ రకాల నిబంధనలు పెడుతూ కోతలు వేసి డబ్బులు మిగుల్చుకుంటున్నారని విమర్శించారు. అమ్మ ఒడి పథకంలో 52 వేల మంది లబ్ధిదారులు తగ్గడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ఒంటరి మహిళల పెన్షన్ వయసు పరిమితిని 50 ఏళ్లకు పెంచి, లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయమని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News