- కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్శిటీలో సీఎస్ ఫైనలియర్ చదువుతున్న బిశాఖ్ మోండాల్
- అతని తండ్రి రైతు కాగా.. తల్లి అంగన్ వాడీ వర్కర్
- గూగుల్, అమెజాన్ లో కూడా బిశాఖ్ కు ఆఫర్లు
తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఆ విద్యార్థి ఎంతో కష్టపడి చదివాడు. అతని కష్టం ఫలించి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన ఫేస్ బుక్ లో ఉద్యోగం వచ్చింది. అది కూడా ఆషామాషీ శాలరీతో కాదు. ఏకంగా రూ. 1.80 కోట్ల ప్యాకేజీతో జాబ్ వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే బిశాఖ్ మోండాల్ కోల్ కతా లోని జాదవ్ పూర్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆయనది ఒక సాదాసీదా పేద రైతు కుటుంబం. తండ్రి రైతు కాగా, తల్లి అంగన్ వాడీ వర్కర్. తన తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ఎంతో కష్టపడి చదివాడు. చివరకు హయ్యెస్ట్ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. బిశాఖ్ మోండాల్ కు ఫేస్ బుక్ కంటే ముందు గూగుల్, అమెజాన్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. అయితే ప్యాకేజీ ఎక్కువగా ఉండటంతో ఫేస్ బుక్ వైపు ఆయన మొగ్గు చూపాడు. సెప్టెంబర్ లో లండన్ లోని ఫేస్ బుక్ లో అతను జాయిన్ కాబోతున్నాడు.
గతంలో కోటి కంటే ఎక్కువ జీతాన్ని తొమ్మిది మంది జేయూ విద్యార్థులు సాధించారు. అందరిలోకెల్లా ఎక్కువ ప్యాకేజీని అందుకున్నది బిశాఖ్ కావడం గమనార్హం. మరోవైపు తమ బిడ్డ తాము గర్వపడేలా చేశాడని అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.