Jogi Ramesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ ఫైర్
- గుడివాడ మహానాడుకు తనను పిలవాలని సవాల్
- సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమని వెల్లడి
- జగన్ ను తిట్టడమే చంద్రబాబు పని అంటూ విమర్శలు
ఏపీ మంత్రి జోగి రమేశ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కున్నావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే గుడివాడ మహానాడుకు తనను కూడా ఆహ్వానించాలని, సామాజిక న్యాయంపై తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏ ముఖం పెట్టుకుని నిమ్మకూరు వస్తావ్? అంటూ మండిపడ్డారు. నిమ్మకూరులో చంద్రబాబు అడుగుపెడితే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. కనీసం ఎన్టీఆర్ కుమారులకైనా సిగ్గులేదా? అని జోగి రమేశ్ నిలదీశారు.
చంద్రబాబు 14 ఏళ్ల పాటు సీఎంగా చేసినా, గుర్తుండిపోయేలా ఒక్క పథకం కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం చేశామని చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. జిల్లాల పర్యటనలో సీఎం జగన్ ను తిట్టడమే చంద్రబాబు పని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక జోకర్ అయితే, అయ్యన్నపాత్రుడు తదితరులు బ్రోకర్లు అని జోగి రమేశ్ పేర్కొన్నారు.